‘ధురంధర్ 2’ దెబ్బకు.. దశాబ్దాల చరిత్రలో తొలిసారి మారిన ‘డీడీఎల్‌జే’ షో టైమ్!

  • ‘ధురంధర్ 2’ కోసం ముంబై మరాఠా మందిర్‌లో 'డీడీఎల్‌జే' షో సమయం మార్పు
  • భారీ రన్‌టైమ్ కారణంగా దేశవ్యాప్తంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రత్యేక షోలు
  • 'జవాన్' ఓపెనింగ్ రికార్డులను అధిగమించే దిశగా అడ్వాన్స్ బుకింగ్స్
  • ఆల్-టైమ్ రికార్డు కోసం అల్లు అర్జున్ 'పుష్ప 2' వసూళ్లను టార్గెట్ చేస్తున్న వైనం
రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న ‘ధురంధర్ 2’ చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కనిపిస్తున్న అసాధారణమైన క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ ప్రభంజనం ఎంతలా ఉందంటే, ముంబైలోని ఐకానిక్ థియేటర్ మరాఠా మందిర్‌లో దశాబ్దాలుగా ప్రదర్శితమవుతున్న షారుఖ్ ఖాన్ 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' (డీడీఎల్‌జే) షో సమయాన్ని కూడా మార్చాల్సి వచ్చింది.

‘ధురంధర్ 2’ నిడివి దాదాపు 3 గంటల 55 నిమిషాలు ఉండటంతో థియేటర్లు షోలను సర్దుబాటు చేయడంలో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి మరాఠా మందిర్‌లో డీడీఎల్‌జే ప్రదర్శనను ఉదయం 10 గంటలకు మార్చారు. గత మూడు దశాబ్దాలుగా ప్రతిరోజూ ఉదయం 11:30 గంటలకు ప్రదర్శించబడుతూ వస్తోంది. దశాబ్దాల చరిత్రలో డీడీఎల్‌జే షో సమయం ఇలా మారడం ఇదే తొలిసారి. ఈ థియేటర్‌లో ‘ధురంధర్ 2’ ను మధ్యాహ్నం 1:15, సాయంత్రం 5:30, రాత్రి 9:45 గంటలకు ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా పలు థియేటర్లు అర్ధరాత్రి, తెల్లవారుజామున కూడా ప్రత్యేక షోలను ప్లాన్ చేస్తున్నాయి. గతంలో 'పుష్ప 2', 'యానిమల్' వంటి భారీ చిత్రాలకు ఇలాంటి మార్పులు జరిగినప్పటికీ, ఒక హిందీ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ దశలోనే ఈ స్థాయిలో ఏర్పాట్లు జరగడం ఇదే మొదటిసారి.

ఆల్-టైమ్ రికార్డులపై కన్నేసిన‌ ‘ధురంధర్ 2’ 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ రికార్డులపై కన్నేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ సరళిని గమనిస్తే, తొలిరోజు వసూళ్లలో షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డును 'ధూరందర్ 2' అధిగమించేలా కనిపిస్తోంది. 'జవాన్' తొలిరోజు హిందీలో రూ. 65.50 కోట్లు, దేశవ్యాప్తంగా రూ. 75 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే ‘ధురంధర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 30.31 కోట్లు రాబట్టింది. 'జవాన్' రికార్డును అందుకోవాలంటే మరో రూ. 35 కోట్ల వరకు అవసరం.

అయితే, హిందీ చిత్ర పరిశ్రమలో ఆల్-టైమ్ హైయెస్ట్ ఓపెనర్ రికార్డు ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' పేరిట ఉంది. ఈ చిత్రం తొలిరోజు హిందీలో రూ. 72 కోట్లు, పాన్-ఇండియా స్థాయిలో రూ. 164.25 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘ధురంధర్ 2’ ఈ భారీ రికార్డును సవాలు చేస్తుందో లేదోనని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తానికి విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద పెను తుపానుకు సంకేతాలు పంపుతోంది.

Dhurandhar 2
Ranveer Singh
Dilwale Dulhania Le Jayenge
DDLJ
Shah Rukh Khan
Aditya Dhar
Maratha Mandir
Box Office Collection
Advance Bookings
Pushpa 2

More Telugu News